- బొరివంకలో ముగిసిన నాటికల పండుగ
అమ్మ చెక్కిన బొమ్మ: వివక్షపై సంధించిన అస్త్రం
మూడవ రోజు ప్రదర్శనల్లో భాగంగా మొదటగా హైదరాబాద్‌కు చెందిన గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రేక్షకులను కదిలించింది. సమాజంలో కేవలం స్త్రీ, పురుషులే కాకుండా భిన్నమైన శరీరతత్వాలతో (ట్రాన్స్ జెండర్) జీవిస్తున్న వ్యక్తుల బాధలను, వారు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను ఈ నాటిక కళ్లకు కట్టింది. పురాణ కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు వారికి సరైన గుర్తింపు లేకపోవడాన్ని ప్రశ్నించింది. వారు కూడా మనసున్న మనుషులని, వారిని అవమానించడం మానవత్వానికే విరుద్ధమని నాటిక ద్వారా బలంగా చాటి చెప్పారు. ఈ నాటికను జ్యోతిరాజ్ భీశెట్టి రచించారు. డా. వెంకట్ గోవాడ అద్భుతమైన దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ప్రదర్శన ప్రేక్షకులకు ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది.స్వప్నం రాల్చిన అమృతం: సానుభూతికి నిలువుటద్దం
కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి బృందం ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతం నాటిక మానవ సంబంధాలలోని లోతును ఆవిష్కరించింది. ఈ నాటిక ఒక అద్భుతమైన ఉదాహరణతో సాగింది. ఒక కాకి గాయపడి కిందపడితే, వాటి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా తోటి కాకులన్నీ చేరి సానుభూతిని చూపిస్తాయి. కానీ బుద్ధిజీవి అయిన మనిషి మాత్రం తోటి మనిషి కష్టాల్లో ఉంటే స్పందించడం లేదనే నిజాన్ని ఈ నాటిక ఎత్తిచూపింది. తోటి జీవి పట్ల ఉండాల్సిన కనీస ప్రేమ, సానుభూతిని మర్చిపోతున్న నేటి సమాజానికి ఈ నాటిక ఒక మేలుకొలుపులా నిలిచింది. పక్షుల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలను హృదయానికి హత్తుకునేలా ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్, గుంటూరు కళాకారులు ప్రదర్శించిన ఇది అతని సంతకం నాటిక కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు, కుమారుడు, అత్తమామలు, కోడళ్ల మధ్య అనుబంధాలను విస్తృతంగా చర్చించింది.![]() |
| (ఇది అతని సంతకం నాటికలో ఓ సన్నివేశం) |
మూడు రోజుల పాటు సాగిన ఈ నాటిక పోటీలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, సమాజంలోని సమస్యలను చర్చిస్తూ సరికొత్త చైతన్యాన్ని నింపాయి. బొరివంక గ్రామ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాభిమానులు ఈ ప్రదర్శనలను చూసి కళాకారులను అభినందించారు. కళింగసీమ కళాపీఠం నిర్వాహకులు చేసిన కృషి నాటక రంగానికి కొత్త ఊపిరి పోసిందని పెద్దలు కొనియాడారు.



